కొడుకులను వైకాపాలో చేర్పించి, జగన్‌కు జైకొట్టిన టీడీపీ ఎమ్మెల్యే  - MicTv.in - Telugu News
mictv telugu

 కొడుకులను వైకాపాలో చేర్పించి, జగన్‌కు జైకొట్టిన టీడీపీ ఎమ్మెల్యే 

September 19, 2020

Visakhapatnam south mla vasupalli ganesh joined in ysr congress party

పిడికెడు మంది ఎమ్మెల్యేలు గోడ దూకకుండా కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అంతేకాకుండా ఏపీ రాజకీయాల్లో దిమ్మతిరిగే రాజకీయం కూడా మొదలైంది.  విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పచ్చపార్టీకి పెద్ద షాకిచ్చారు. తన కొడుకులను వైకాపాలో చేర్పించి, జగన్‌కు జైకొట్టారు. తను ప్రభుత్వానికి మద్దతుటా ఉంటానని చెప్పారు. 

వాసుపల్లి ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోతన కొడుకులకు తీర్థం ఇప్పించారు.  రాజధానిగా విశాఖ వస్తుందని కోరుకున్నానని, జగన్ విధానాలు తనకు నచ్చాయని గణేష్ చెప్పుకొచ్చారు. టీడీపీ అనర్హత వేటు వేస్తే ఎదుర్కొంటానని, ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.  జగన్ దమ్మున్న నాయకుడని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ చేరుతున్నాయని కొనియాడారు. ‘విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తీసుకొచ్చారు. నా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇదంతా జగన్ వల్లే సాధ్యమైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి ఆయనకు కనుకగా ఇస్తా’ అని అన్నారు. గణేష్ కుటుంబం రాకతో తమ పార్టీ మరింత బలపడిందని వైకాపా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. 

చంద్రబాబు విధానాలు నచ్చక గణేష్ కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. విశాఖకు రాజధాని రావడంతో ఆయనలో మార్పొచ్చింది. టీడీపీ తరఫున రెండు సార్లు గెలిచిన ఆయన తన కుటుంబ భవిష్యత్తును, ముఖ్యంగా కొడుకులను రాజకీయాల్లో తీసుకురావడానికి అధికార పార్టీనే సరైందని భావించినట్లు తెలుస్తోంది.