పాలకులు మారితే ఏం లాభం.. ఆ గ్రామానికి రోడ్డులేదు.. అందుకే ఇలా - Telugu News - Mic tv
mictv telugu

పాలకులు మారితే ఏం లాభం.. ఆ గ్రామానికి రోడ్డులేదు.. అందుకే ఇలా

May 14, 2020

ప్రభుత్వాలు, పాలకులు మారినా ప్రజల బతుకులో మాత్రం మార్పు రావడం లేదు. కనీస రోడ్డు మార్గం లేక గిరిజన ప్రాంతాలు ఎన్నో అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. ఎన్నో ఏళ్లుగా రోడ్డు మార్గం కోసం అర్జీలు పెట్టుకొని అధికారుల చుట్టు తిరిగినా ఫలితం మాత్రం లేకపోయిది. దీంతో అలిసిపోయిన మన్యం ప్రజలు తామే స్వయంగా రోడ్డు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. పలుగు పార చేతి పట్టుకొని సొంత డబ్బులతో రహదారి నిర్మించుకుంటున్నారు. ఇదంతా జరుగుతోంది మరెక్కడో కాదు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో వెలుగులోకి వచ్చింది. 

మండ్రెబ గిరిజన గ్రామం పెద్దకోట పంచాయతీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. వీరికి ఏ పని కావాలన్నా పెద్ద కోటకు వెళ్లాల్సిందే. దీంతో విద్యా, వైద్యం అన్నింటికి కష్టంగానే మారింది. ఎన్నో ఏళ్లుగా అక్కడి ప్రజలు రోడ్డు మార్గం కోసం అధికారులను కలుస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో గుర్రాలనే ఆశ్రయిస్తున్నారు. సమీపంలోని దేవరపల్లికి గుర్రాలపై వెళ్లి వస్తువులు తెచ్చుకుంటున్నారు. దీంతో తామే స్వయంగా రోడ్డు సౌకర్యం కల్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో రోడ్డు పనులు ప్రారంభించారు. ఇకనైనా ప్రభుత్వాలు తమను పట్టించుకొని రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.