తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసుక్రీస్తు కృప, దయ వల్లే కరోనా మహమ్మారి తగ్గిపోయిందని, డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల కాదని డీహెచ్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ విభాగం తీవ్రంగా ఖండించింది. ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇంత దిగజారి మాట్లాడడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మత విభేదాలను ప్రేరేపించేలా, కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడటం కరెక్టు కాదని ఆక్షేపించింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని ప్రశ్నించారు. ఏసుక్రీస్తు వల్లే దేశం అభివృద్ధి సాధించిందని ఆయన మాట్లాడటంలో అసలు అర్థం ఉందా? అని నిలదీశారు. లక్షల మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇదంతా ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనమని ఆక్షేపించారు. అసలు ఏసుక్రీస్తుకి, దేశ అభివృద్ధికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. మానవ జాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని మిగతా దేవుళ్ళందరూ ఉత్తిదే అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టులో ఆయనపై కేసు వేసి సస్పెండ్ చేసేదాకా పోరాటం చేస్తామని వీహెచ్పీ తెలిపింది.