విశ్వక్ సేన్ ఇబ్బంది పెట్టాడు.. అర్జున్ ఫైర్
టాలీవుడ్‌లో కొత్త వివాదం రగులుకుంది. యంగ్ స్టార్ విశ్వక్ సేన్‌పై దక్షిణాది సీనియర్ నటుడు అర్జున్ సర్జా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. విశ్వక్ హీరోగా, తన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా తన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను పక్కన పెట్టినట్లు ఆయన సంచలన ప్రకటన చేశాడు. ‘దీనికంతా కారణం అతడే. కాల్ షీట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు..’ అని అర్జున్ తీవ్ర ఆరోపణలు చేశాడు. శనివారం ఆయన ఫిల్మ్ చాంబర్లో విలేకర్ల సమావేశం పెట్టి యువనటుడిపై నిప్పులు చెరిగాడు.
విశ్వక్ చెప్పిన కథ నచ్చే సినిమా మొదలు పెట్టానని, తర్వాత ఏమైందో ముఖం చాటేశాడని అన్నాడు. ‘‘అంతా బాగా సాగుతున్నప్పుడు విశ్వక్ తప్పుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. నా జీవితంలో అతనికి చేసినన్ని కాల్స్ ఎవరికీ చేయలేదు. అతడు కోరినంత రెమ్యూనరేషన్‌కు ఒప్పందం చేసుకున్నాం. కానీ కాల్‌షీట్స్ ఇష్టం వచ్చినట్లు మార్చాడు. రేపు షూటింగ్ ఉందనగా డుమ్మా కొట్టాడు. షూటింగ్‌కు అన్నీ సిద్ధం చేసుకున్నాక క్యాన్సిల్ చేయండి అని మెసేజ్ పెట్టాడు. ఇది ప్రొఫెషనలిజం కాదు’ అని అర్జున్ ఆరోపించాడు. ‘’చాలా డేట్స్ వ్యర్థమయ్యాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఎందరో స్టార్ హీరోలే క్రమశిక్షణతో ఉంటారు. సహకరించని వారితో సినిమా చేయలేదు.. అందుకే విశ్వక్ మూవీ నుంచి తప్పుకుంటున్నాను.. సహకరించని వారితో సినిమా చేయడం సాధ్యం కాదు. మన ఇళ్లలో మనం ఉందాం’’ అని అన్నారు. దీనిపై నిర్మాతల మండలితో మాట్లాడతానని, తనలా మరొకరు ఇబ్బంది పడొద్దని అన్నారు. అర్జున్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విశ్వక్ సేన్ తన మిత్రులతో అన్నారని వార్తలు రావడంతో అర్జున్ దీనిపై స్పందించారు.