హైదరాబాద్ నగరానికి మరో మణిహారంలా మారింది దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి. రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిని కేంద్రమంత్రి జి కిషన్రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేబుల్ వంతెనను హైదరాబాద్ ప్రజలకు అంకితం చేశారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెన నగరవాసులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరంతో పాటు, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయాలు ఉండవు. అయితే, కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో చాలామంది దానిని చూడటానికి వెళ్తున్నారు. వేలాది మంది కొత్త బ్రిడ్జిని చూసేందుకు తరలిరావడంతో బ్రిడ్జిపై రద్దీ నెలకొని ట్రాఫిక్ స్తంభించిపోతోంది.
దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేబుల్ బ్రిడ్జిపై ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలో ప్రజలు ఉచితంగా ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నార్తన్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శన జరగనుందని తెలిపారు. 45 నిమిషాల పాటు ప్రదర్శన నిర్వహించనున్నారు. వందేమాతరంతో ప్రారంభించి పలు దేశభక్తి, భారతీయ, పాశ్చాత్య గీతాలతో సంగీతాన్ని ప్రదర్శించి జయహోతో ముగించనున్నారు.