సింగపూర్‌లో కశ్మీర్ ఫైల్స్‌పై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్‌లో కశ్మీర్ ఫైల్స్‌పై నిషేధం

May 10, 2022

‘ది కశ్మీర్ ఫైల్స్’ .. ఈ ఏడాది మార్చి 11న వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమా చూసిన వారిలోకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసి ఊహించని విజయం సొంతం చేసుకుంది. కశ్మీర్ పండితుల మీద తీసిన ఈ సినిమాను సింగపూర్‌ నిషేధించినట్లుగా సమాచారం. ‘కశ్మీర్ ఫైల్స్ సినిమా రెచ్చగొట్టేలా ఉంది. కశ్మీర్‌లో హిందువులపై జరిగిన దాడులను, అందులో ముస్లింల పాత్రను చిత్రీకరించడంలో ఏకపక్షంగా వ్యవహరించారు.’ అంటూ సింగపూర్ అధికారులు తెలిపినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ .. బీజేపీ పార్టీ ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్‌ను సింగపూర్‌లో బ్యాన్ చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు.

అయితే శశి థరూర్ వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కాస్త అతిగా స్పందించారు. శశిథరూర్ ను తెలివితక్కువ వాడిగా సంబోధిస్తూ.. సింగపూర్ సెన్సార్ ప్రపంచంలోనే అత్యంత రిగ్రెసివ్ సెన్సార్ అని , అది క్రైస్తవ మతం ఆధారంగా వచ్చిన ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సినిమాపై , ది లీలా హోటల్ ఫైల్స్ అనే రొమాంటిక్ సినిమాలపై కూడా నిషేధం విధించిందని అవసరమైతే మీ మేడమ్(సోనియా)ను అడగండి అంటూ సెటైర్ వేశారు. దయచేసి కశ్మీర్‌లో జరిగిన హిందూ మారణహోమాన్ని ఎగతాళి చేయకండి అంటూ రీ ట్వీట్ చేశారు.