మోదీ బయోపిక్ నటుడి ఇంట్లో ‘డ్రగ్స్’ సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ బయోపిక్ నటుడి ఇంట్లో ‘డ్రగ్స్’ సోదాలు

October 15, 2020

Vivek Oberoi's Home Searched in Drugs Case

హిందీ, కన్నడ సినీ పరిశ్రమలను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. రెండు పరిశ్రమల్లోని కొందరు నటీనటులు ఇప్పటికే విచారణ ఎదురుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధ కపూర్ లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు విచారణకు హాజరయ్యారు. కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణిలు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ముంబైలోని వివేక్ ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. 

కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో వివేక్ బంధువు ఆదిత్య అల్వాకు సంబంధాలు ఉండటంతో వివేక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ‘ఆదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వివేక్ ఆదిత్యకు బంధువు కావడంతో అతని గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని సోదాలు చేపట్టాం. ఇందుకు సంబంధించి కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నాం. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ బృందం ముంబైలోని అతని నివాసాని వెళ్లింది.’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక బృందం బెంగళూరులోని ఆదిత్య అల్వా ఇంట్లో సోదాలు నిర్వహించింది. కర్ణాటక మాజీ మంత్రి, జీవరాజ్‌ కుమారుడు ఆదిత్య అల్వా. అతడి సోదరి ప్రియాంకను వివేక్ వివాహం చేసుకున్నాడు. పలువురు కన్నడ సినీ ప్రముఖలకు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో ఆదిత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.