మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు మూడు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ మాత్రం ఈ కేసులో విచారణ సరైన మార్గంలో జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని.. తనపై తప్పుడు జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. అయితే అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సీబీఐ వద్దే తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు. సీబీఐ తరఫున స్పెషల్ పీపీలు నాగేంద్రన్, డాక్టర్ అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాశ్‌రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్ కవర్‌ను కోర్టుకు అందజేశారు.