విశాఖ ఘటనపై సీఎం జగన్ ఆరా.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ ఘటనపై సీఎం జగన్ ఆరా.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

June 30, 2020

nfg

విశాఖపట్నంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే  సీఎం జగన్‌ ప్రమాదంపై ఆరా తీశారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసినట్టు అధికారులు సీఎంతో చెప్పారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా బాధకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా సోమవారం అర్ధరాత్రి తర్వాత సాయినార్ కంపెనీలో బెంజిన్ గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.