విశాఖలో విష వాయువు విలయాన్ని సృష్టించింది. 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పశువులు, పక్షులు నురగలు కక్కుకుంటూ మరణించాయి. వందాలాది మంది స్థానికులు ఇంకా కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అవస్థతకు గురి కావడం వెనక ప్రజలు భయంతో పరిగెత్తడమే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్టుగా చెబుతున్నారు.
పాలిమర్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన విష వాయువులతో కళ్లు మండటం, కడుపులో తిప్పడం, చర్మంపై పొక్కులు రావడం కనిపించాయి. దీంతో వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తారు. ఇదే వారిని ఎక్కువగా అస్వస్థతతకు గురయ్యేలా చేసిందని అంటున్నారు. చాలా మంది తమ పిల్లలను ఎత్తుకొని పరిగెత్తడంతో అలిసిపోయి ఎక్కువగా గాలి పీల్చుకోవాల్సి వచ్చింది. దీంతో విష వాయువులు పెద్ద ఎత్తున వారి శరీరంలోకి వెళ్లిపోయాయి. పదేళ్లలోపు చిన్నారులున్న తల్లిదండ్రులే ఎక్కువగా ప్రభావితం అయ్యారు. దీంతో పాటు చిన్న పిల్లలు పరిగెత్తకపోవడంతో వారు విషవాయువులు ఎక్కువగా పీల్చకపోవడంతో ప్రభావం తక్కువ ఉందని వైద్యులు అంటున్నారు. కాగా ప్రస్తుతం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కిడ్నీలు, కాలెయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నట్టు చెబుతున్నారు.