విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా, గతకొన్ని రోజులుగా ప్రైవేటీకరణను ఆపాలంటూ, విశాఖ ఉక్కు – ఆంధ్ర హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, నేతలు, ఉద్యోగులు రోడ్లపై బెటాయించారు.
అయితే, ఈ విషయంపై సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం లిఖిత పూర్వకంగా స్పష్టతనిచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని, కేంద్ర ఉక్కు శాఖ పార్లమెంట్ కు వివరణ ఇచ్చింది. ఈ ప్రైవేటీకరణతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగుతాయని స్పష్టతనిచ్చింది.