మహిళా హోంగార్డుకు కరోనా.. విశాఖలో కలకలం
ఏపీ పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టించింది. విశాఖపట్నంలో ఓ మహిళా హోం గార్డుకు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను ఐసోలేషన్ కోసం తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. దీంతో ఆమెతో పాటు పని చేసే పోలీసు సిబ్బంది తమకు ఎక్కడ సోకిందోనని భయపడిపోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పోలీసులకు వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ ఏపీలో కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం అందరిని భయపెడుతోంది.
నిన్న కరోనా పరీక్షలు జరపగా నగరంలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. అందులో మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో పని చేసే హోంగార్డుకు కూడా వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆమె నివాసం వద్ద శానిటైజేషన్ పనులు చేపట్టారు. బాధితురాలిని గీతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తండ్రి, సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటి వరకు జిల్లాలో 66 మంది కరోనా పాజిటివ్ అని తేలగా తొలిసారి పోలీసు శాఖలో వైరస్ బయటపడటం కలవరం సృష్టించింది. నిత్యం లాక్‌డౌన్ డ్యూటీలో ఉండే పోలీసులు ఇలా వ్యాధికి గురి కావడంతో స్థానికుల్లోనూ ఆందోళన మొదలైంది.