Vizianagaram Youth Dies While Playing Kabaddi Game
mictv telugu

విషాదం.. కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి

January 1, 2023

Vizianagaram Youth Dies While Playing Kabaddi Game

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ఆట ఇంటర్ విద్యార్థి ప్రాణాన్ని తీసింది. ఆటలో భాగంగా కూతకు వచ్చిన వ్యక్తిని రమణ అనే యువకుడు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మిగతా ప్లేయర్స్ అంతా వచ్చి రమణ మీద పడడంతో ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విశాఖ కేజీహెచ్‎కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. రమణ మృతితో జిల్లాలోని పూసపాటిరేగ మండలం యోరుకొండలో విషాధ చాయలు అలుముకున్నాయి. చేతికి అందొస్తున్న కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా కబడ్డీ ఆడిన రమణ మృతిని స్నేహితులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. న్యూఇయర్ సందర్భంగా నాలుగు గ్రామాల మధ్య ఈ కబడ్డీ పోటీలు జరిగాయి. అగ్రహారం, యోరుకొండ, వెంపడాం, కొవ్వాడ నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. యోరుకొండ, పెంపడాం జట్లు ఫైనల్స్‌ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భీమిలీ కబడ్డీ సినిమా తరహాలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. రమణ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.