Voters Dharna For Money In munugode Polling
mictv telugu

అంగట్లో ఓట్లు..డబ్బుల కోసం ధర్నాలు..!

November 3, 2022

Voters Dharna For Money In munugode Polling

మునుగోడు బై పోల్‌లో చిత్రవిచిత్రాలు జరిగాయి. నోట్లు నాట్యమాడాయి. మద్యం ఏరులై పారింది. ఓటర్ల ఆశల్ని ఆమాంతం పెంచేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ సెన్సెక్స్‌లా మార్చేశారు.తులం బంగారమంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ టీజర్ వదిలారు. బొమ్మ పడే టైమ్‌కి బోర్డు తిప్పేశారు. ఇంకేముంది ఆశించిభగపడ్డ కొందరు ఓటర్లు ధర్నాకు దిగారు. తులం బంగారం లేదా డబ్బులు ఇస్తేనే ఓటేసేస్తామని తెగేసి చెప్పారు. అంతేకాదు ఓ ఊర్లో ధర్నాకు దిగారు. నాయకుల ఇళ్ల ముందు రచ్చ రచ్చ చేశారు.

మైండ్ సెట్ మారింది…

బై పోల్ పుణ్యమా అని తెలంగాణలో ఓటర్ మైండ్ సెట్ మారింది. లేదు లేదు బలవంతంగా పార్టీలు మార్చేశాయి. బై పోల్ అంటే ఇవ్వు రాజా ఇవ్వు. పోటీపడి మరి అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. హుజూరాబాద్ నుంచి ఈ విష సంస్కృతికి బీజం వేశారు. అక్కడ నుంచి మొదలైన ప్రలోభాలపర్వం మునుగోడులో ముదిరింది. ఓటుకోసం ఎంతైనా ఇస్తాం..మా అభ్యర్థిని గెలిపిస్తే చాలు.. అని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. అంతకుమించి ఖర్చుచేశాయి. తులం బంగారమంటూ ప్రత్యర్థి పార్టీపైకి సోషల్ మీడియాలో ఫేక్ అస్త్రాల్ని సంధించారు.

తులం తెచ్చిన తంటా

సరిగ్గా ఇక్కడే ఓ పార్టీ విసిరిన బాణం మరో పార్టీకి గట్టిగా గుచ్చుకుందట. పోలింగ్ ముందు ఏం చేయలేక ఆ పార్టీ చేతులెత్తేసిందట. ఇంకేముంది భంగపడిన ఓటర్లు ధర్నాకు దిగారు. తులం బంగారం ఇఛ్చి తీరాల్సిందేనని భీష్మించుకూర్చున్నారు. రూ.3వేలు కాదు తులం బంగారం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే ఓటు వేయబోమని తెగేసి చెప్పారు.

అసలేం జరిగిందంటే….

గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్‌ని బాయ్ కాట్ చేశారు. నేతలు డబ్బులు పంచుతామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారని ఆరోపించారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ పైసాలు ఇవ్వలేదని చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు తేల్చిచెప్పారు.

ఇది దేనికి సంకేతం

మునుగోడు మాయలో హక్కుని అమ్ముకుంటున్నామని కొందరు ఓటర్లు మర్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం పడేస్తున్నామన్న సోయి లేకుండాపోయింది..వాళ్లు ఇస్తున్నారు..మేం తీసుకుంటున్నాం..అంతా వాళ్లదే తప్పు అని లాజిక్కులెత్తుకుంటున్నారు.ఇక్కడ పార్టీలది మొదటి తప్పు. డబ్బులు ఆశ చూపకపోతే వాళ్లు ఎందుకు అడుగుతారు. నచ్చిన అభ్యర్థికి ఓటేయండి…మేం డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు.ఇలా చెప్పే దమ్ము, ధైర్యం ఏ పార్టీకి లేదు. అందుకే ఓటు అంగట్లో అమ్మకానికి పెట్టారు.భవిష్యత్‌లో ఉపఎన్నికలంటే భయపడేలా చేశారు.