సీఎం సభలో రికార్డింగ్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో రచ్చ
ఏకంగా సీఎం సభలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ విమర్శలకు దారి తీసింది. హరియాణాలోని థానేసర్ నియోజకవర్గంలోని హతీరా గ్రామంలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో ఇది జరిగింది. సీఎం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రావడం ఆలస్యమౌతుందని సభ నిర్వాహకులు కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ఆశ్లీల డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీన్ని అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పించడంతో బీజేపీ తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది.
స్టేజీపైకి చేరుకున్న మహిళలు ఆశ్లీ నృత్యాలతో సభకు వచ్చిన వారికి వినోదాన్ని పంచారు. ఆ డ్యాన్స్ చూస్తూ యువత ఉర్రూతలుగిపోయింది. డ్యాన్స్ చేస్తున్నంత సేపు అక్కడి ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అక్కడే పోలీసులు కూడా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వారు కూడా డ్యాన్స్ చూస్తూ ఉండిపోయారు. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆశీర్వాద సభ పేరుతో అసభ్య డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. ధానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధ మాట్లాడుతూ సభను తాము ఏర్పాటు చేయలేదని హతీరా గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే స్టేజీపై డ్యాన్స్ చేసింది కూడా మహిళలు కాదని.. ట్రాన్స్ జెండర్స్ అంటూ వివరణ ఇచ్చారు. అంతకు ముందు సంప్రధాయ నృత్యాలు కూడా చేశారని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని సర్పంచ్ సునీల్ మెహ్రా వెల్లడించారు. పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ సంబధం లేదన్నారు. ఏది ఏమైనా సీఎం సభలో అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం సరికాదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.