భయంకరమైన కారు ప్రమాదం నుంచి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను కాపాడి హీరోలుగా నిలిచారు బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్. వీరిద్దరే లేకుంటే రిషబ్ ప్రాణాలతో ఉండే వారు కాదని తెలుస్తోంది. క్రికెట్ అభిమానులకు వీరిద్దరూ ఇప్పుడు రియల్ హీరోలయ్యారు. ఈ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హర్యానా ఆర్టీసీ వీరిని సత్కరించింది. హర్యానా రోడ్‌వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జంగ్రా వారికి ప్రశంసాపత్రం, షీల్డ్ అందించారు. డ్రైవర్, కండాక్టర్లు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని జాంగ్రా అన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్లను గౌరవిస్తుందని తెలిపారు.
తాజాగా సుశీల్ కుమార్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్. హర్యానా రోడ్‌వేస్‌కు చెందిన డ్రైవర్ సుశీల్ రియల్ హీరో అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. మండుతున్న కారు నుంచి పంత్‌ను బయటకు తీసి, అతని చుట్టు బెడ్‌షీట్ చుట్టిన సుశీల్ రియల్ హీరో అన్నాడు. మీ నిస్వార్ధ సేవకు మేం రుణపడి ఉన్నామని, రియల్ హీరో సుశీల్ జీ అంటూ లక్ష్మణ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. బస్సు కండెక్టర్ పరమ్‌జిత్‌ను కూడా లక్ష్మణ్ మెచ్చుకున్నాడు. స్వార్ధం లేని ఈ వ్యక్తులు ఇద్దరూ గొప్ప హృదయం కలిగినవారని, వాళ్ల సమయస్పూర్తి అమోఘమని, పంత్‌ను రక్షించినవారందరికీ లక్ష్మణ్ థ్యాంక్స్ తెలిపాడు.
ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు పంత్ స్వగ్రామం రూర్కీ బయలుదేరిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. హర్యానా రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ మాట్లాడుతూ సుశీల్, పరంజీత్ ఇద్దరు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ (రవాణా), నవదీప్ విర్క్ కూడా వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు.