హైదరాబాద్‌లో ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

February 28, 2020

bhhgr

హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర విషాదం జరిగింది. నిద్రిస్తున్న చిన్నారులపై ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాంపల్లిలోని హబీబ్‌నగర్‌ ప్రాంతంలో ఇది జరిగింది. దీంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ మరణించడం అందరిని కన్నీరు పెట్టించింది. గాయపడిన ఇద్దరు చిన్నారులకు నీలోఫర్‌లో చికిత్స అందిస్తున్నారు. 

మిఠాయి లాల్, సీమ అనే దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల అతడు సిమెంటు ఇటుకలతో చిన్న ఇంటిని నిర్మించుకున్నాడు.ఇదే ఇంట్లో గబ్బార్, సురేఖ అనే దంపతులు కూడా నివాసం ఉంటున్నారు. వీరంతా తమ పిల్లలను గురువారం రాత్రి అన్నం తినిపించి నిద్ర పుచ్చి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి గోడకూలి మరణించారు. మిఠాయిలాల్ ముగ్గురు పిల్లలు మరణించగా,గబ్బార్ ఇద్దరు పిల్లలకు గాయాలు అయ్యాయి. 

కాగా పునాదులు లేకుండా ఇంటిని నిర్మించడం వల్లే ఇలా జరిగిందని అధికారులు గుర్తించారు. ముందు వంట గది దిమ్మె పడిపోవడంతో కుదుపునకు గురై గోడ కూడా కూలింది. అది అక్కడే పడుకున్న పిల్లలపై పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.