Waltair Veerayya Chiranjeevi movie review
mictv telugu

వాల్తేరు వీరయ్య.. మూవీ రివ్యూ

January 13, 2023

Waltair Veerayya Chiranjeevi movie review

మామూలుగానే మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజంటే అభిమానులకు పండగ. అలాంటిది మాంచి మాస్ పాత్రలో నటించి పండగ స్పెషల్ గా థియేటర్లకి ఎంట్రీ ఇస్తే ఆ హడావిడి ఏ రేంజులో ఉంటుందో చెప్పక్కర్లేదు. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ డైరెక్షన్లో చిరు నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మరి హార్డ్‌కోర్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందా? కథనంతో కట్టిపడేసిందా?

కథ విషయానికొస్తే..
వైజాగులోని జాలరిపేటలో చేపలు పడుతూ అప్పుడప్పుడు నేవీ అధికారులకు కూడా సాయం చేస్తూ, అయినవాళ్లకు అండగా ఉంటాడు వాల్తేరు వీరయ్య(చిరంజీవి). మరోవైపు డ్రగ్ మాఫియా నడుపుతున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) అరెస్టయి, తప్పించుకునే క్రమంలో స్టేషన్లోని పోలీసుల్ని చంపేస్తాడు. దాంతో తన నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని డ్యూటీలో ఉన్న సీతాపతి(రాజేంద్ర ప్రసాద్) సస్పెండ్ చేస్తారు అధికారులు. ఎలాగైనా మలేషియాలో ఉన్న సాల్మన్ సీజర్ ని ఇక్కడికి రప్పించి చట్టం ముందు నిలబెట్టాలని, అందుకు సాయం చేయగల తగిన వ్యక్తి వీరయ్యే అని ఇరవై లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంటాడు సీతాపతి. తీరా మలేషియా వెళ్లాక సాల్మన్ అన్న మైఖేల్ సీజర్ (ప్రకాష్ రాజ్)కూ, వీరయ్యకూ పాత పగలున్నాయనీ, మైఖేల్ కోసమే వీరయ్య మలేషియా వచ్చాడనీ తెలుస్తుంది. అసలింతకీ వీరయ్యకీ, మైఖేలుకీ ఏంటి సంబంధం? వాళ్ల మధ్యున్న పగేంటి? సీతాపతి అనుకున్నట్టుగా సాల్మన్ పట్టుబడ్డాడా? సిన్సియర్ ఏసీపీ విక్రమ్ (రవితేజ)కీ, వీరయ్యకి ఉన్న గతమేంటి? విక్రమ్ కి ఏమైంది? ఇదంతా సినిమాలో నడిచే కథ.

కథనం ఎలా ఉందంటే..
కమర్షియల్ పరంగానే కథలో ఎలివేషన్లు, పాత్రలు, అందుకు తగ్గ ఎమోషన్లు ఉండేలా, మరీ ముఖ్యంగా మెగా అభిమానులను అలరించేలా చూసుకున్నాడు దర్శకుడు బాబీ. ఓ ఫైట్ సీన్ తో చిరు ఎంట్రీ, వెంటనే ఓ మాస్ సాంగ్, ఆ తర్వాత కథని నడిపించే కొన్ని సీన్లు, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, పెద్దగా స్కోప్ లేని లవ్ స్టోరీతో హీరో, హీరోయిన్ ప్రేమలో పడిపోవడం, ఓ డ్యూయెట్ సాంగ్, మళ్ల కథని నడిపంచే ఇంకొన్ని సీన్లు, సెకండాఫ్ మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేసేలా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్సుని రంగరించి ఇంటర్వెల్. ఆ తర్వాత కథలో మరో ముఖ్య పాత్రయిన విక్రమ్(రవితేజ)ని ప్రవేశపెట్టి, కొన్ని సెంటిమెంట్ సీన్లు, ఇంకొన్ని కామెడీ సీన్లు, మరికొన్ని ఎలివేషన్ సీన్లు, ప్రీ క్లైమాక్స్ అవ్వగానే ఓ సాంగ్, మళ్లీ ఓ మాస్ ఫైట్ తో క్లైమాక్స్. ఇలా.. ఫక్తు కమర్షియల్ తరహాలో సినిమా సాగి మొత్తానికి ముగుస్తుంది.
వింటేజ్ చిరంజీవిని చూయించేలా కొన్ని సీన్లను మాత్రం పక్కాగా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్ బాబీ. చిరు కామెడీ టైమింగ్ తో కూడిన సన్నివేశాలతో పాటు జగదేకవీరుడు అతిలోక సుందరి, ఠాగూర్, ముఠామేస్త్రీ.. ఇలాంటి మెగాస్టార్ హిట్ సినిమాల రిఫరెన్సులతో తీసిన సీన్లు ఫ్యాన్సుని బాగా అలరిస్తున్నాయి.

ఎవరెలా చేశారంటే..
ఓ ఊరమాస్ రోల్‌లో చిరంజీవి వెండితెరపై కనపడక చాలా ఏళ్లయిందన్న అభిమానుల ఆకలి తీర్చేలా పాత్రలో రెచ్చిపోయాడు మెగాస్టార్. యాసతో పాటు యాక్షన్ తోనూ వీరయ్యగా వీరంగం ఆడేశాడు. ఓ వైపు సీరియస్, సెంటిమెంట్ సీన్లలో చెలరేగిపోతూనే తనదైన కామెడీతో కూడా నవ్వించాడు. ఇక హీరోయినుగా శ్రుతి హాసన్‌కి ఓ ఫైట్ సీన్, రెండు పాటలతో సరిపెట్టారు. సిన్సియర్ పోలీసాఫీసర్ ఏసీపీ విక్రమ్‌గా రవితేజ పాత్రలో ఒదిగిపోయాడు. నటన పరంగా తనకు అలవాటైన పాత్రే అయినా తను మాట్లాడిన తెలంగాణ యాస మాత్రం కాస్త ఎక్కువ కృతకంగానే ఉంది. రవితేజ తెలంగాణ యాసలో డైలాగులు చెచ్చినప్పుడల్లా కాస్త ఇబ్బందిపడక తప్పని పరిస్థితి. ఇక విక్రమ్ భార్యగా కేథరిన్ కూడా కొన్ని సీన్లకు పరిమితమై పెద్దగా స్కోప్ లేకుండా సరిపెట్టుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంతో అలరించినా పాటల విషయంలో మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టనట్టు కనిపిస్తుంది. ఆ లోపం స్పష్టంగా వినిపిస్తుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బాబీసింహా, శ్రీనివాస రెడ్డి, సత్యరాజు, నాజర్.. ఇలా ఎవరి పాత్రల్లో వారు ఉన్న సీన్ల వరకైనా బానే చేశారు.

ఓవరాల్‌గా ఎలా ఉందంటే..
పండక్కి ఓ మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్సుతో పాటు సెంటిమెంట్ కూడా మేళవించిన ఓ సినిమా చూడాలనుకుంటే వాల్తేరు వీరయ్య హాయిగా చూసేయొచ్చు. ఇక సగటు ప్రేక్షకుడి విషయం పక్కనబెడితే చిరు అభిమానులకైతే పూనకాలు తెప్పించుకుని ఎంజాయ్ చేయొచ్చు. కథ, కథనం పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోనుంటే అన్నిరకాల ఆడియెన్సును అలరించేందుకు అవకాశం ఉండేది. కానీ అంత రిస్క్ తీసుకోకుండా రొటీన్ ఫార్ములాతోనే నడిపించేశారు.