సంక్రాంతి సంబరాలు ఒకవైపు.. సినిమాల వేడుక మరోవైపు. 2023 సంవత్సరం సినిమా లవర్స్ కి ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ఇండస్ట్రీ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటంతో అందరి హీరోల ఫ్యాన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. టాక్ కి సంబంధం లేకుండా రెండు సినిమాలని ఆడియన్స్ సమానంగా ఆదరిస్తున్నారు. మొదట వీర మాస్ కలెక్షన్స్ తో 2023 సంక్రాంతికి శుభారంభం చేశాడు బాలయ్య. అఖండ సూపర్ హిట్ తో వచ్చిన క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ.. జనవరి 12న వీరసింహారెడ్డి థియేటర్స్ లో విడుదలవ్వగా.. మొదటి రోజే 52కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించాడు. బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ డే వసూళ్ళలో టాప్ గా నిలిచింది వీరసింహారెడ్డి. ఇక ఇప్పటివరకు అంటే నాలుగు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ‘వీరసింహారెడ్డి’ సినిమా రూ.100 కోట్ల మార్కును దాటేసింది.104 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి.. రూ.54 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ని వీరసింహారెడ్డి రాబట్టినట్టు అంచనా.
ఇక మరోవైపు మెగా కుమ్ముడు మాములుగా లేదు. ఆచార్య, గాడ్ ఫాదర్ నిరాశ పరచినా.. వాల్తేరు వీరయ్య చిరంజీవికి కూడా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ కాంబినేషన్ కావటం, కామెడీపై మాత్రమే ఫోకస్ పెట్టడం వంటివి వీరయ్యకి కలిసొస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ పల్స్ ని పట్టుకున్న చిరంజీవి వాల్తేరువీరయ్యతో తెగ నవ్వించేశాడు. ఈ చిత్రం జనవరి 13న విడుదలవ్వగా.. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపుతోంది వీరయ్య. బాలయ్య నాలుగు రోజుల్లో 100కోట్ల మార్క్ దాటితే.. మూడు రోజుల్లోనే మెగా స్టార్ సెంచరీ దాటేయటం గమనార్హం.