వామ్మో.. ఏడు జన్మలు కాదు కదా, ఏడు సెకన్లు కూడా వద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. ఏడు జన్మలు కాదు కదా, ఏడు సెకన్లు కూడా వద్దు..

June 14, 2022

వామ్మో..’మా భార్యలతో మేం వేగలేం, ఏడు జన్మలు కాదు కదా, ఏడు క్షణాలు కూడా వారిని మేం భరించలేం, వారు మాకొద్దు’ అంటూ భార్యా బాధితులు కొందరు వట సావిత్రి పూర్ణిమ వ్రతం చేసిన సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన వలూజ్‌లో సోమవారం భార్యా బాధిత వ్యక్తి ఆశ్రమంలో కొంతమంది భార్యా బాధితులు సమావేశమయ్యారు. అనంతరం వారందరూ కలిసి వట సావిత్రి వ్రతాన్ని చేశారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు వద్దని, ఏడు క్షణాలు కూడా వారిని మేము భరించలేకపోతున్నామని పీపల్ చెట్టుకు పూజలు చేసి, దారాలు కట్టారు. ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి.

పూజారి భరత్ ఫులారి మాట్లాడుతూ.. ”కొందరు మహిళలకు పీపల్ చెట్టును పూజించే అర్హత లేదు. మహిళలకు అండగా కొన్ని చట్టాలు ఉండడంతో కొంతమంది మహిళలు వారి భర్తలను తెగ వేధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెడుతున్నారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చింది.? పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే . ‘మా భార్యలతో మేం వేగలేం, ఏడు జన్మలు కాదు కదా, ఏడు క్షణాలు కూడా వారిని మేం భరించలేం, వారు మాకొద్దు’ అంటూ వట సావిత్రి పూర్ణిమ వ్రతం చేశాం” అని ఆయన అన్నారు.

మరోపక్క ఈ వ్రతాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు మాత్రమే ఆచరిస్తారు. ఎందుకంటే ఏడేడు జన్మలకు ఒక్కరే తమ భర్తగా రావాలని కోరుతూ, వ్రతాన్ని చేస్తారు. సావిత్రి తన భర్త సత్యవంతుడిని యమధర్మరాజు నుంచి రక్షించుకుంది. అదేవిధంగా తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ, పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. మహిళలు చేయాల్సిన వత్రాన్ని భర్తలు చేయడంతో వారి భార్యలు వీరిని ఇంతగా టార్చర్ పెడుతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.