‘కరోనా’కు ఫోన్ చేసి హాట్ సమోసాలు కావాలన్నాడు.. తర్వాత లబోదిబో..  - MicTv.in - Telugu News
mictv telugu

‘కరోనా’కు ఫోన్ చేసి హాట్ సమోసాలు కావాలన్నాడు.. తర్వాత లబోదిబో.. 

March 30, 2020

Want hot samosas, Rampur man asks lockdown helpline, made to clean drains

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట వెలిగించుకోడానికి నిప్పు దొరికిందని మరొకడు ఎగిరి గంతేశాడట. కరోనా ముప్పు నుంచి కాపాడుకోడానికి ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటే ఓ తిండిపోతు మాత్రం వింత కోరికలు కోరాడు. కరోనా కోసం నిర్వహిస్తున్న హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి.. ‘హేయ్.. నాకు పిజ్జాలు కావాలి..’ అని కోరాడు. మొదట అధికారులు పట్టించుకోలేదు. ఎవరో పిచ్చోడు ఫోన్ చేసి ఉంటాడులే అనుకున్నాడు. కానీ వెంటనే మరో కాల్ వచ్చింది. ఇదివరకు పిజ్జాలు కోరిన గొంతే. ‘హలో నాకు వేడి వేడి సమోసాలు కావాలి… ఇప్పుడే కావాలి..’ అన్నాడు. లైన్ అధికారులు మొదట విస్తుపోయారు. తర్వాత  ‘అలాగే, నీ అడ్రస్ చెప్పు బాబూ.. ఇదిగో, ఉన్నపళంగా తీసుకొస్తున్నాం..’ అని వివరాలు కనుక్కున్నారు. 

తర్వాత అతని వద్దకు చేరారు. వేడివి కాకపోయినా కాస్త వెచ్చగా ఉన్న సమోసాలను అతనికి అందించారు. సమోసా బాంబు సంబరపడిపోయి మెక్కేశారు. బుక్కడం అయిపోయక అధికారులు చెప్పాల్సిన కబురు చల్లగా చెప్పేశారు. ‘మెక్కావు కదా. ఇదిగో పారా, పలుగూ తీసుకోం. చాలా డ్రైనేజీ పనులు ఉన్నాయి.. బయల్దేరదామా..’ అని తీసుకెళ్లారు. అతనితో డ్రైనేజీలను శుభ్రం చేయించి తర్వాత హెచ్చరించి వదిలేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది.