ఇంచు జాగా కూడా చైనాకు వదలం.. రాజ్‌నాథ్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇంచు జాగా కూడా చైనాకు వదలం.. రాజ్‌నాథ్ సింగ్

October 25, 2020

"Want Tension At Border To End": Rajnath Singh After "Shastra Puja"

విజయదశమి దసరా సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఆయుధ పూజ నిర్వహించారు. భారత్-చైనా సరిహద్దుల వద్ద వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్‌ వద్ద ఆయన సైనికులతో కలిసి ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. 

 ఈ సందర్భంగా సైనికులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సేవలు చేస్తున్నవారి అంకితభావాన్ని ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని సైనికులను ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత్ కోరుకుంటోందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆయుధ పూజ అనంతరం సిలిగురిలో కీలక సైనిక స్థావరమైన 33 కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మన దేశ సైన్యం మన దేశ భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా చైనాకు వదిలిపెట్టబోదని అన్నారు. 

ఉద్రిక్తతలు అన్నీ మాసిపోయి శాంతి పునరుద్ధరణ జరగాలని భారత దేశం కోరుకుంటోందని స్పష్టంచేశారు. ‘మన సైన్యం మన భూభాగంలో కనీసం ఒక అంగుళం భూమినైనా ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వదనే నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు. 

ఆయుధ పూజ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జనరల్ ఎంఎం నరవనే, ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కాగా, మే నెల నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి రాజ్‌నాథ్ సరిహద్దుల్లో ఆయుధ పూజ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.