భారతదేశంలో అన్నం తినేవాళ్లు ఎంతమంది ఉన్నారో, రొట్టెలతో కడుపు నింపుకొనే వాళ్లు కూడా అంతమందే ఉన్నారు. అయితే చాలామందికి మెత్తటి రొట్టెలు చేయడం ఇప్పటికీ సాధ్యం కాదు. అందుకే వారికోసమే ఈ చిట్కాలు..
ప్రతీ తెలుగవారి వంటింట్లో వారంలో ఒక్కరోజైనా చపాతీ టిఫిన్ గా ఉంటుంది. అదే ఉత్తర భారతదేశంలో రోజూ అదే లంచ్, డిన్నర్ కూడా. అయితే పర్ఫెక్ట్ గా రావడానికి కష్టపడుతుంటారు. ఇక నుంచి చింత అక్కర్లేదు! కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తేనే మెత్తటి రొట్టెలను తయారుచేసుకోవచ్చు.
వేడినీళ్లు..
చపాతీ పిండి కలుపడానికి మామూలు నీళ్లు తీసుకుంటాం. అలాకాకుండా వేడినీళ్లు పోసి చపాతీ పిండి కలిపి చూడండి. ఇలా చేయడం వల్ల పిండి కూడా మంచిగా కలుస్తుంది. అంతేకాదు.. కలుపగానే చపాతీలు చేయడానికి పూనుకోకండి. కాసేపు పిండిని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల తర్వాత చపాతీలు చేసి చూడండి. మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి చపాతీలు వచ్చేస్తాయి.
చపాతీ ముద్ద..
చిన్న చపాతీ ముద్దలను చేసుకోండి. అలా అని దాన్ని స్కేల్ పెట్టి కొలిచేరు. కాకపోతే 5 నుంచి 7 అంగుళాల్లో చపాతీ ఉండాలి. 1.5 నుంచి 2.5 మిల్లీమీటర్ల మందం ఉన్నప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి. అలాగే కాల్చేముందు దానికి పిండి లేకుండా మొత్తం దులిపేయడం మరచిపోవద్దు.
పిండి ముఖ్యం..
అసలు చపాతీ చేయాలంటే పిండి ముఖ్యం. మెత్తగా ఉండే పట్టించిన పిండిని ఉపయోగించండి. బ్రాండ్ ఎంచుకునే ముందు కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే రోటీలు మల్టీ గ్రెయిన్ పిండి అయితే మెత్తగా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ పిండిని జల్లెడ పట్టి ఆ తర్వాత చపాతీలను చేయాలి.
నూనె బదులు నెయ్యి..
ఈ స్టెప్ చాలా మామూలే అనిపించొచ్చు. కానీ ఇదే అసలైనది. చపాతీ చేసేటప్పుడు కూడా పిండికి బదులు కొద్దిగా నూనె రాసి చేయండి. దీనివల్ల చెక్కబోర్డుకు పిండి అంటుకోదు. ఇక కాల్చేటప్పుడు నూనెకు బదులు నెయ్యిని ఉపయోగిస్తే కూడా చపాతీలు మృదువుగా వస్తాయి.
సమయం కూడా..
చపాతీ చేసే ముందు పాన్ వేడిగా ఉండాలి. అది కూడా 160 నుంచి 180 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. పూర్తిగా వేడయ్యాక దాని పై కొన్ని చుక్కల నీటిని వేయాలి. ఆ తర్వాత చపాతీ వేసి మొదటి వైపు 10 నుంచి 15 సెకన్ల పై పాటు, వెనుక వైపు 30 నుంచి 40 సెకన్ల పాటు వేసి కాల్చాలి. అప్పుడే మృదువైన చపాతీలు వస్తాయి.