కొత్త ట్రెండ్.. పేరు కోసమే ఎమ్మెల్యేను పొడిచా..  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త ట్రెండ్.. పేరు కోసమే ఎమ్మెల్యేను పొడిచా.. 

November 20, 2019

MLA.

విశాఖ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి భుజంపై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అప్పట్లో చెప్పింది గుర్తుండే ఉంటుంది. జగన్‌కు సానుభూతి రావాలనే పొడిచానని అతడు చెప్పాడు. జగన్ లాంటి వీఐపీలను టార్గెట్ చేస్తున్న దుండగులు ఒక్కొక్కడు ఒక్కో కారణం చెబుతున్నాడు. 

హత్య చేస్తే తప్పకుండా తాను జనం దృష్టిలో పడతానని గుడ్డిగా భావించి రంగంలోకి దిగాడు ఓ పేరు కక్కుర్తి వీరుడు. కానీ కథ అడ్డం తిరిగి..  చివరికి చీకటి గదిలో ఇనుప చువ్వలు లెక్కిస్తున్నాడు. ఆ నిందితుడి పేరు ఫర్హాన్. అతను హత్య చేయాలనుకున్న వీఐపీ ఎవరంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్వీర్‌ సేట్‌. 

తాను ఫేమస్ అవ్వడానికే ఎమ్మేల్యేను కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించానని నిందితుడు పర్హాన్‌ విచారణలో వెల్లడించడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. దీంతో ఫర్హాన్‌ను మంగళవారం కోర్టుకు హాజరుపరచగా కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనకాల ఇంకా ఎంతమంది హస్తం ఉంది అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. 

ఈ హత్యాయత్నం గురించి ఫర్హాన్ స్నేహితులు మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం నేను ఓ వీఐపీని హత్య చేయబోతున్నట్లు ఫర్హాన్‌ చెప్పాడు. అప్పుడు మేమంతా తమాషాగా మాట్లాడుతున్నాడని అనుకున్నాం. కానీ, అన్నంత పనిచేయడంతో మేమంతా షాక్‌కు గురయ్యాం’ అని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఆదివారం రాత్రి ఈ హత్యాయత్న ఘటన అనంతరం ఫర్హాన్‌ కుటుంబం మొత్తం పరారైంది. ఇంటికి తాళం వేసి ఫర్హాన్‌ తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా కనిపించడం లేదు.

ఇదిలావుండగా దాడి ఘటనలో గాయపడ్డ తన్వీర్‌ సేట్‌ మైసూరు కొలంబియా ఏషియా ఆస్పత్రి ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని వైద్యులు వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న కారణంగా తన్వీర్‌సేట్‌ గన్‌మ్యాన్‌ ఫిరోజ్‌ ఖాన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.