బాలీవుడ్, శాండిల్‌వుడ్ మధ్య ట్విట్ల వార్ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్, శాండిల్‌వుడ్ మధ్య ట్విట్ల వార్

April 28, 2022

బాలీవుడ్, శాండిల్‌వుడ్ మధ్య ట్విటర్లో వార్ మొదలైంది. ఇటీవలే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఇకపై హిందీ జాతీయ భాష కాదని, బాలీవుడ్ వాళ్లు వారి సినిమాలను తెలుగు, తమిళంలోకి డబ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

సుదీప్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు ఘాటుగా స్పందించారు. అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. సౌత్‌లో కేవలం రెండు సినిమాలు విజయం సాధించిన మాత్రాన బాలీవుడ్ రేంజ్ పడిపోయినట్లేనా అని అన్నారు. అనంతరం మరో స్టార్ హీరో అజయ్ దేవగణ్ సైతం సుదీఫ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

‘మేరే భాయ్ కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు. మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషే. జనగణమన’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ఉధ‌ృతం అయింది.

అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, ‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశ భాషల భిన్నత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ప్రతి భాషకు కూడా దాని గొప్ప చరిత్ర ఉంటుంది. వారి మాతృ భాష పట్ల ఆయా ప్రజలు ఎంతో గర్విస్తుంటారు. కన్నడ వ్యక్తిని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.