war of words between Bodhan MLA Shakeel and Nizamabad BJP MP Arvind
mictv telugu

చెప్పుతో కొట్టాలి, పందిని పట్టించుకోను.. షకీల్, అర్వింద్ రచ్చ

July 14, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, బీజేపీ ఎంపీ అర్వింద్.. నువ్వా, నేనా అన్నట్లుగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే ఎంపీ అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ ప్రశ్నించారు. ఎంత సేపు ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఆయనకు మరోపని లేదని అన్నారు. అమెరికా నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడమే ఆయన పని అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. వరదల సమయంలో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతున్న అర్వింద్ వస్తే… ప్రజలు నిలదీయాలని, చెప్పుతో కొట్టాలని అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల పరిహారం ఇప్పించాలని షకీల్ డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మపురి అర్వింద్.. షకీల్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. షకీల్‌ను పందితో పోల్చారు. పందులకు తాను సమాధానం చెప్పనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపితే.. వరద సాయం చేయడానికి కేంద్రం రెడీగా ఉందని ప్రకటించారు. వరద నష్టంపై నివేదికలు పంపడానికి టీఆర్‌ఎస్ సర్కార్‌కు చేతకాదని అర్వింద్ ధ్వజమెత్తారు.

ఇరువురు నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న నేతలు ఇలా దిగజారి మాట్లాడడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా తాము సమాజంలో ఓ ఉన్నత స్థానంలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ విమర్శలు చేసుకోవడంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.