సాధారణ మనుషులో, ఆన్ లైన్ మనీ ట్రాన్సక్షన్స్ గురించి అవగాహన లేనివాళ్లో లేదంటే చదువురాని వాళ్లో సైబర్ నేరగాళ్ల మాయలో పడి డబ్బులు పొగొట్టుకున్న ఉదంతాలెన్నో. కానీ చాలా కాలం నుంచి బ్యాంకింగ్ రంగంలోనే పని చేస్తున్న బ్యాంక్ ఉన్నతాధికారి సైబర్ మోసగాళ్లకి చిక్కడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొబైల్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేసి దాదాపు 2.25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లాలో శుక్రవారం జరిగింది.
పరకాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్ లో బీహార్ కు చెందిన సకల్ దేవ్‌సింగ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఈ నెల 23వ తేదీన రాత్రి సమయంలో ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో ‘మీ ఎస్‌బీఐ అకౌంట్ డీయాక్టివేట్ అవుతోంది. దయచేసి మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీ పాన్ కార్డు నెంబర్ ను అప్ డేట్ చేయండి’’ అని ఉంది. తెల్లవారుజామున ఆ మెసేజ్ చూసుకొని, పాన్ కార్డ్ నెంబర్ ను అప్ డేట్ చేద్దామనే ఉద్దేశంతో అందులో లింక్ను రెండు సార్లు క్లిక్ చేశాడు. కానీ అప్డేట్ ఫెయిల్ అయింది. ఈలోగా మరో నెంబర్ నుంచి కాల్ వచ్చింది. పాన్ కార్డు అప్ డేట్ చేసేందుకు తాము మరో మేసేజ్ పంపించామని, దానిపై క్లిక్ చేస్తే అప్ డేట్ అవుతుందని అందులో ఓ వ్యక్తి చెప్పారు.
బ్యాంకు వెళ్లిన తరువాత ఆ ప్రక్రియ పూర్తి చేస్తానని సకల్ దేవ్‌సింగ్ బదులిచ్చారు. బ్యాంకుకు వెళ్లి, తనకు వచ్చిన నెంబర్ కు మేనేజర్ కాల్ చేశాడు. అవతలి వ్యక్తి మరో సారి వాట్సప్ కు ఓ లింక్ ను పంపించాడు. దానిని ఓపెన్ చేయగానే క్షణాల్లో అకౌంట్ లో నుంచి డబ్బులు మాయం అయ్యాయి. మొత్తం మూడు లావాదేవీల్లో రూ.2,24,967 అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మేనేజర్ వెంటనే పోలీసులను సంప్రదించాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారని ఫిర్యాదు చేశారు.