వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలూ లేవని టాక్సికాలజీ రిపోర్టులో చెప్పడంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసును ఏవో గిమ్మిక్కులు చేసి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రీతి బాడీ నుంచి రక్తం శాంపిల్స్ తీసుకోవడంలో కుట్ర ఉందని ఆమె తమ్ముడు పృథ్వీ, తల్లి శారద ఆరోపించారు.
‘‘ప్రీతికి డలయాలసిస్ చేసి బ్లడ్ క్లీన్ చేశారు. కొత్త రక్తం ఎక్కించడంతో పాత రక్తం పూర్తిగా పోయి ఉంటుంది. తర్వాతే శాంపిల్ తీసుకున్నారు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అధికారులు తొలి నుంచి వాస్తవాలు చెప్పకుండా దాస్తున్నారు’’ అని అన్నారు. తమ అమ్మాయిది ముమ్మాటికీ హత్యలేనని, హాస్పిట్లలో ఘటన రోజునుంచి చనిపోయేవరకు మొత్తం ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రీతి కుప్పకూలి సమయంలో సైఫ్ అక్కడ ఎందుకున్నాడో చెప్పాలంటున్నారు. ప్రీతిని సైఫ్ కులం పేరుతో దూషించిన మాట నిజమేనని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతుండడం తెలిసిందే.