వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. ఐదు రోజులు చావుతో పోరాడి చివరికి ఓడిపోయింది. ఆమెను బ్రతికించేందుకు నిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. క్షేమంగా తిరిగొస్తాదనుకున్న కూతురు మరణించడంతో ప్రీతి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తోటి విద్యార్థులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు నెలలుగా సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధిస్తుండడంతో విషపూరిత ఇంజెక్షన్ చేసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి వరంగల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకొచ్చారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. ఐదురోజులుగా ప్రీతిని రక్షించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె చివరికి చనిపోయింది. నిమ్స్ కు వచ్చినప్పటికే ప్రీతి ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.