వరంగల్ వైద్య విద్యార్థుల కష్టం..ఇళ్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్లు - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ వైద్య విద్యార్థుల కష్టం..ఇళ్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్లు

March 25, 2020

Warangal

కరోనా కోసం వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ప్రశంసిస్తూ యావత్ దేశం మొత్తం ఈ నెల 22న చప్పట్లతో అభినందించింది. ప్రధాని మోదీ పిలుపుతో ఎంతో ఉత్సాహంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇది ఎక్కువ  కాలం నిలవలేదు. ప్రాణాలకు తెగించి, కరోనా వార్డుల్లో పని చేస్తున్న డాక్టర్లపై ఇంటి ఓనర్లు వివక్ష చూపుతున్నారు. అద్దెకు ఉంటున్న వైద్యులు తమ ఇళ్లలో ఉండటానికి వీలులేదంటూ ఖాళీ చేయిస్తున్నారు. వరంగల్‌లో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.  

కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థికి ఇటువంటి చేదు అనుభవం ఎదురైందట. కొన్ని రోజులుగా అతడు కరోనా వార్డులో పని చేస్తున్నాడని తెలిసి వెంటనే ఇళ్లు ఖాళీ చేయమని ఓనర్ చెప్పాడు. మరో ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 200 మంది కేఎంసీ విద్యార్థులు ఎంజీఎం ఆసుపత్రిలో హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది అద్దె గదుల్లో ఉంటుండగా వారికి ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం తెలిసిన కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కేఎంసీలో మరో 50 మందికి వసతిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.