హైదరాబాద్ -చెన్నై విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. అయితే ఇది ఫేక్ కాల్ గా గుర్తించిన పోలీసులు వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ ప్రయాణికుడు సోమవారం చెన్నైకి విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఆ ఫ్లైట్ సమయానికి ఎయిర్ పోర్టుకు చేరుకోలేదు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పాడు.
విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. అధికారులు అత్యవసరంగా నిలిపివేసి, విచారణ కోసం విమానాన్ని క్లియర్ చేయాల్సి వచ్చింది. అయితే, విచారణలో బాంబు పుకారు అవాస్తవమని తేలింది. అదే సమయంలో విమానాశ్రయ అధికారులు వేగంగా చర్యలు చేపట్టి ప్రయాణికుడిని పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు ఆవరణలోనే బాంబు కాల్ వచ్చినట్లు విచారణలో తేలింది.
ప్రయాణికుడిని చెన్నైలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) చీఫ్ ఇంజనీర్ అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు. అతను హైదరాబాద్-చెన్నై ఇండిగో ఎక్కేందుకు ఆలస్యంగా చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లోకి రాకుండా ఆపేయడంతో, ఫ్లైట్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానానంలో తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ మరియు ఇతర బృందాలను పిలిచి తనిఖీలు చేశారు. ఇంతలో విమానాశ్రయ అధికారులు వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని పట్టుకునేందుకు తప్పుడు సమాచారం ఇచ్చానని అంగీకరించాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై RGIA పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.