వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్యాయత్నం కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున మట్వాడ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని.. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం సీరియస్‌గా రియాక్టయింది. నిందితుడు సైఫ్ ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేరును వాడుకుంటూ బాధితురాలిని బెదిరింపులకు గురి చేసినట్లుగా ప్రీతి తండ్రి చేసిన వ్యాఖ్యలతో ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఈనేపథ్యంలోనే వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి కేసు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ప్రీతిని సైఫ్ వేధించినట్లు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. ప్రీతిని అవమానించే విధంగా వాట్సాప్‌లో సైఫ్ ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రీతి గదిలో పలు కీలక ఆధారాలను కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం… ప్రీతి గదిలో మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మత్తు మందు మోతాదుపై ఆమె గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్థినిని పరామర్శించడానికి మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్లారు. నిందితుడు సైఫ్ పై ప్రీతి తండ్రి మట్వాడ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితమే ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యం వహించినట్లుగా బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈనేపథ్యంలో కేసు నమోదు, సరైన విచారణ చేయకపోవడంపై ఏసీపీ బోనాల కిషన్ నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనను వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.