తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ ఎంజీఎం వైద్య విద్యార్థిని ఆత్మహత్య యత్నం కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సైఫ్‌కు మద్దతుగా నిలుస్తూ… శుక్రవారం విధులు బహిష్కరించి, ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ప్లకార్డులతో నిరసనకు దిగారు. సైఫ్‌పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పీజీలు, జూడాలు అంటున్నారు. విచారణ పూర్తి కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అత్యవసర సేవలు మినహా ఓపీ, మిగిలిన సేవలను బహిష్కరించారు. ఈ మేరకు సైఫ్‌కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు.
డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విచారకరమని.. ఇదే సమయంలో సైఫ్‌పై అసాధారణమైన కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. తమ వృత్తిలో జూనియర్లను సీనియర్లు పని విషయంలో మందలించడం సహజమేనని.. ఇది కొత్తేమీ కాదన్నారు. సైఫ్‌పై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు చాటింగ్‌లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
వరంగల్ సీపీ రంగనాథ్ ఈ కేసు గురించి మీడియాకి వెల్లడిస్తూ.. ‘‘ఎంజీఎంలో సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ ఉంది. అందరి ముందూ సైఫ్ అమ్మాయిని అవమానించాడు. బ్రెయిన్ లేదని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని స్నేహితులకు చేసిన చాట్‌లో ప్రీతి పేర్కొంది. ఏమైనా ఉంటే హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయాలని సైఫ్‌కు చెప్పింది. ప్రీతి ప్రశ్నించే తత్వమే సైఫ్‌కు మింగుడు పడినట్లులేదు. ఒక వ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలైతే అది ర్యాగింగ్ కిందకే వస్తుంది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్టు చేశాం’’ అని సీపీ పేర్కొన్నారు.