సీనియర్ మెడికో వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్ధిని ధరావత్ ప్రీతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరంగల్ నుంచి ప్రీతిని నిమ్స్‌కి తరలించగా, ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదని చెప్తున్నారు. డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు డాక్టర్ల బృందం ప్రీతి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.
అటు వేధింపులకు పాల్పడినట్టు చెప్తున్న సీనియర్ సైఫ్‌ని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి వాట్సాప్ చాటింగును రిట్రీవ్ చేసిన పోలీసులు మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ తమిళిసై నిమ్స్‌కి వచ్చి ప్రీతికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో విద్యార్ధి సంఘాలు పలు చోట్ల ఆందోళన చేశాయి. నిమ్స్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.