పోలీసుల దయా గుణం..అరెస్టైన కార్మికులకు అన్నం పెట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసుల దయా గుణం..అరెస్టైన కార్మికులకు అన్నం పెట్టారు

November 26, 2019

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరేందుకు ఉదయం నుంచే డిపోలకు తరలివచ్చారు. అయితే వారిని డ్యూటీలో చేర్చుకునే అంశంపై ఆదేశాలు లేకపోవడంతో మేనేజర్లు లోపలికి అంగీకరించలేదు. కార్మికులు అక్కడే నిరసనకు దిగడంతో వారిని పోలీసు అరెస్టు చేశారు. తెలంగాణ అంతాట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రం దీనికి కాస్త భిన్నమై వాతావరణం కనిపించింది. 

Warangal Police.

సాధారణంగా పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఏదో ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వారి సౌకర్యాల గురించి ఏ మాత్రం పట్టించుకోరు. కొన్నిసార్లు పచ్చి మంచి నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. విధి నిర్వహణలో భాగంగా నిరసనకారులపై ఖాకీలు కఠినంగానే ఉంటారు. కానీ వరంగల్ డిపో1,2 వద్దకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు అందుకు భిన్నంగా ఉన్నారు. అరెస్టు చేసిన వారిని దగ్గరలోని శుభం గార్డెన్‌కు తరలించి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ముందుగానే చేశారు. ఉదయాన్నే రావడంతో కార్మికులకు వెంటనే టిఫిన్ పెట్టి శాంతింపజేశారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ఏర్పాటు చేసి వారే స్వయంగా వడ్డించి కార్మికుల ఆకలిని తీర్చి మానత్వం చాటుకున్నారు. 

తమ పట్ల దయా గుణం చూపిన పోలీసులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫొటోలు చూసిన వారంతా వరంగల్ పోలీసులు ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఏంటో చూపించారని అంటున్నారు. అందరి విషయంలోనూ పోలీసులు ఇలాగే స్నేహంగా వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు చేసిన పనితో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.