‘ఆచార్య’ ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆచార్య’ ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను

April 21, 2022

నైజాంలో సినిమా విడుదల చేయాలంటే ఇప్పటివరకు దిల్ రాజు పేరే వినిపించేది. కానీ, ఆ మధ్య వరంగల్ శీను అనే వ్యక్తి దిల్ రాజుకు పోటీగా వచ్చాడని కొన్ని కథనాలు వెలువడ్డాయి. దిల్ రాజును కాదని ఆయనకు సినిమాలు ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి తొలిసారి నటించిన ఆచార్య సినిమాను వరంగల్ శీను దక్కించుకున్నారు. మొత్తం రూ. 42 కోట్లకు డీల్ జరిగిందని సమాచారం. దీనికి కారణం దర్శకుడు కొరటాల శివ అని టాక్ వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమా విషయంలో దిల్ రాజుతో శివకు మనస్పర్ధలు వచ్చాయంట. దాంతో దిల్ రాజు ఎంత ప్రయత్నించినా ఆచార్య సినిమా పంపిణీ హక్కులను దక్కలేదు.

ఇంతేకాక, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ కూడా వరంగల్ శీనుకే దక్కాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆచార్య హక్కులను దక్కించుకున్న వరంగల్ శీను ఆ చిత్రం ఫస్ట్ రివ్యూ చెప్పేశాడు. ‘ఆచార్యలో మంచి కథ ఉంది. ప్రేక్షకులు కోరుకునేవన్నీ సినిమాలో ఉన్నాయి. నేను చిరంజీవి అభిమానిని. ఆయనతో సినిమా నిర్మించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఏడాదిన్నర క్రితం కొన్నాను. నాకు రాకుండా చాలా మంది ప్రయత్నించారు. వారెవరో మీకు తెలుసు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రచ్చ రచ్చే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్ 29న రానున్న ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ వేదిక ఖరారైంది. 23వ తేదీన యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండులో సాయంత్రం ఆరు గంటలకు జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.