Warangal: Two MGM Hospital Doctors and ward boy Suspended For Negligence
mictv telugu

కుట్లు వేసేందుకు రూ.350 డిమాండ్.. సీఎం కేసీఆర్‌కు ఇదంతా తెలుసంటూ హేళన

July 19, 2022

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన నిరుపేద భార్యాభర్తలకు కుట్లు వేసేందుకు వైద్య సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మీడియోలో కథనాలు రావడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు డాక్టర్లు, వార్డు బాయ్‌ని సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులకు మెమోలు ఇచ్చారు.

వరంగల్‌ దేశాయిపేటకు చెందిన బింగి రామకృష్ణ, సరస్వతి దంపతులు. భారీ వర్షాలకు ఆదివారం మధ్యాహ్నం వారి ఇంటి స్లాబ్‌ పెచ్చులూడి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు. అక్కడ కుట్లు వేసే క్యాజువాలిటీ ఆపరేషన్‌ థియేటర్‌(సీవోటీ) గదికి వెళ్లగా.. కుట్లువేయడానికి దారం లేదు, కట్టడానికి కాటన్‌ లేదు బయట కొనుక్కోండి అంటూ వైద్య సిబ్బంది గద్దించారు. ప్రభుత్వాసుపత్రిలో అన్నీ ఉచితంగా ఇవ్వాలి అని అడిగినందుకు అవన్నీ సీఎం కేసీఆర్‌కు తెలుసునంటూ హేళన చేశారు. చేసేది లేక తన భార్య కోసం రామకృష్ణ బయటకు వెళ్లి రూ.320 ఖర్చుచేసి కుట్లు వేసే దారం, కాటన్‌ తీసుకొచ్చాడు. రామకృష్ణకు కూడా దారం, కాటన్‌ బయటే తెచ్చుకోవాలని, లేదంటే తమకు ఆ డబ్బులిస్తే కుట్లు వేస్తామన్నారు. దీంతో అంజాద్‌అలీ అనే వార్డు బాయ్‌కు రూ.350 ఇవ్వడంతో జేబులో ఉన్న కుట్టు దారం, కాటన్‌ తీసి రామకృష్ణకు కుట్లు వేశారు. అయితే ఈ తతంగాన్ని బాధితులతో వచ్చిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేయడాన్ని గమనించి వార్డుబాయ్ వారి ఫోన్ లాక్కుని డిలీట్ చేసిన తర్వాతే వైద్యం చేశాడు.

దీంతో బాధితుల తరపు వారు స్థానిక కార్పోరేటర్ సురేశ్‌జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి సూపరింటెండ్‌ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి వార్డుబాయ్‌ అంజాద్అలీని విధుల నుంచి తొలగించడంతో పాటు అతనిపై మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సివిల్‌ అసిస్టెంటు సర్జన్‌ డాక్టర్‌ రితీష్‌, అసిస్టెంటు ప్రొఫెసర్‌ ఆఫ్‌ జనరల్‌ సర్జరీ డాక్టర్‌ రంజిత్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ స్టాఫ్‌ నర్సులు యాకలక్ష్మి, ఎం.జ్యోతి, కె.సుజాతలకు మెమోలు జారీ చేశారు.