వార్డు వాలంటీర్ల నిరసన.. కారణం ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

వార్డు వాలంటీర్ల నిరసన.. కారణం ఇదే

March 27, 2020

Ward Volunteers Protest in Rajahmundry  

కరోనా భూతాన్ని తరిమేందుకు ఏపీలో వార్డు వాలంటీర్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెల్త్ సర్వే, నిత్యావసరాల సరఫరా చేస్తూ లాక్‌డౌన్‌లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సీఎం జగన్ కూడా ప్రజలు ఎవరూ రాకూడదని ఆదేశించారు. ఇలాంటి సమయంలో వార్డు వలంటీర్లు నిరసనకు దిగడం సంచలనం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వార్డు వాలంటీర్లు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 

ప్రజలు ఎవరూ గుంపులుగా ఉండకూడదని సీఎం జగన్ ఆదేశించిన కొద్దిసేపటికే ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. హెల్త్ సర్వే చేస్తుండగా ఎందుకు బయటకు వచ్చారని పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారంటూ ఆందోళనకు దిగారు. తాము వాలంటీర్లమని చెబుతున్నా వినిపించుకోవడం లేదని వాపోయారు.  పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించకపోతే తాము విధులు నిర్వర్తించబోమని చెప్పారు.దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు బయట ఎవరు కనిపించినా లాఠీలకు పని చెబుతున్న సంగతి తెలిసిందే.