తెలంగాణ: ఆహారంలో బల్లి..31 మందికి అస్వస్థత
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉన్న ప్రభుత్వ బాలికల గురుకుల ఆశ్రమంలో దారుణం జరిగింది. బల్లిపడిన ఆహారాన్ని విద్యార్థినులకు వడ్డించడంతో, 31 మంది విద్యార్ధినీలు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆ ఆశ్రమంలో 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు దాదాపు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా, ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి అన్నంలో కనిపించింది. గమనించిన కుక్ వెంటనే అన్నంలోని బల్లిని తీసివేశాడు.
అప్పటికే ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడున్న హాస్టల్ సిబ్బంది వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి, హాస్టల్‌కు పంపించగా, మరో 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో పరిస్థితి విషమించటంతో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అనంతరం తమ బిడ్డలు అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని విషయం తెలుకున్న తల్లిదండ్రులు..కన్నీరు మున్నీరు అయ్యారు. మరికొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియక కంగారు పడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరతున్నారు.