ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జలంధర్ సమీపంలో సినీ ఫక్కీలో 100 కార్లతో ఛేజ్ చేసి అమృత్ పాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి అనుచరులను కూడా అరెస్ట్ చేసారు పోలీసులు. అమృత్ పాల్ సింగ్ షాహ్‌కోట్ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు శనివారం ఉదయం నుంచి అతడి కోసం గాలించారు. సరిహద్దులు దాటి వెళ్లిపోకుండా అన్ని చెక్‌పోస్టుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. చివరికి అతడి కారును ఛేస్ చేసి పట్టుకున్నారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్తితులు తలెత్తాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు రేపటి వరకు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. బ్యాంకింగ్, మొబైల్ రీఛార్జీ సేవలను మినహాయింపు ఇచ్చారు.రాష్ట్ర ప్రజలు ఎలాంటి హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా ఉండాలని పంజాబ్ పోలీసులు కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దంటూ..పౌరులకు విజ్ఞప్తి చేశారు.
గత కొంత కాలంగా సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్ నినాదాలతో యువతను అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. అతడి సూచనల మేరకు ప్రత్యేక దేశం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత నెలలో అమృత్ పాల్ సింగ్, ఆయన అనుచరులు గత నెలలో అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అల్లర్ల కేసులో అరెస్టయిన తమ అనుచరుడిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు పక్కాప్రణాళికతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అమృత్ పాల్ సింగ్ అరెస్టు తో ప్రపపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సిక్కు వేర్పాటువాదులు ఆందోళనలకు దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర నిఘా వర్ఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించాయి.
నటుడు దీప్ సిద్దూ మృతి అనంతరం ‘వారిసే పంజాబ్ దే’ ఉద్యమ సంస్ధకు అమృత్ పాల్ సింగ్ నాయకుడిగా ప్రకటించుకున్నాడు.అనంతరం తన ప్రసంగాలు ద్వారా యువతను ఆకర్షించుకొని ఆందోళన బాట పట్టించాడు.