తెలంగాణ: పోలీసుల హెచ్చరిక..మూడోసారి చిక్కితే ఇక అంతే..
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న ద్విచక్ర వాహనదారులకు పోలీసులు ఓ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. 3 నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడుసార్లు పట్టుపడితే, మొదటిసారి రూ.100, రెండోసారి రూ. 200, మూడోసారి రూ. 500 జరిమానాను విధిస్తామని తెలియజేశారు. అంటే దాదాపు 400శాతం అదనంగా జరిమానాను విధిస్తున్నామని, ఇప్పటికైనా ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.
"గతంలో హెల్మెట్ లేకపోతే రూ. 100 జరిమానా విధించాం. ప్రస్తుతం 3 నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడుసార్లు పట్టుపడితే మొదటిసారి రూ. 100 రెండోసారి రూ. 200 మూడోసారి రూ.500 జరిమానా వేస్తున్నాం. ఈ జరిమానాలకు ప్రధాన కారణం..వాహనదారులకు నిబంధనల ఉల్లంఘనల అమలు విషయంలో చైతన్యం తీసుకురావడం కోసమే ఇలా చేస్తున్నాం. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యను కనీసం వందకు తగ్గించాలన్నదే పోలీసుల లక్ష్యం. అందుకే మరింతగా జరిమానాను విధించాలన్న నిర్ణయానికి వచ్చాం" అని తెలియజేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది వాహనదారులకు పోలీసులు జరిమనాలు విధించారు. అయితే, మొదటిసారి వేసిన చలానాను క్లియర్ చేసిన వారికి మళ్లీ జరిమానాను విధించడం లేదని అధికారులు తెలిపారు. జరిమానా చెల్లించని వారికి మాత్రమే 400 శాతం అధికంగా విధిస్తున్నామన్నారు. మరోవైపు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న దాదాపు 200 మందిపై ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు అయ్యాయని, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామని పోలీసులు తెలిపారు.