ప్రజలకు హెచ్చరిక.. ఆ జిరాక్స్ కాపీలను ఎవ్వరికి ఇవ్వకండి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలకు హెచ్చరిక.. ఆ జిరాక్స్ కాపీలను ఎవ్వరికి ఇవ్వకండి

May 29, 2022

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఓ హెచ్చరిక చేసింది. ఆధార్ కార్డుకు సంబంధించిన జిరాక్స్‌ కాపీలను ఎవరికీ ఇవ్వవద్దని దేశ ప్రజలను కోరింది. అలా ఇచ్చిన జిరాక్స్ కాఫీలతో దుర్వినియోగం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది. ”ఆధార్‌ను జారీ చేసే యూఐడీఏఐ లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే వివిధ వ్యక్తుల సమాచారం పొందేందుకు వాడుకోవచ్చు. లైసెన్స్ లేని హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు వ్యక్తుల ఆధార్ కార్డుల జిరాక్స్‌ను తీసుకోకూడదు. ఒకవేళ కాదని తీసుకుంటే ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరం. ఏ సంస్థ అయిన ఆధార్ కోసం డిమాండ్ చేస్తే, సదరు సంస్థకు యూఐడీఏఐ నుంచి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్ డ్ ఆధార్ కార్డ్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.” అని వెల్లడించింది.

ప్రస్తుతం మార్కెట్లో కొత్త సిమ్ కార్డ్ కొనాలన్నా, ఏదైనా జాబ్‌కు ఇంటర్వ్యూకు వెళ్లినా, బ్యాంక్‌కు వెళ్లి కొత్త ఖాతా తెరవాలన్నా, పింఛను కావాలన్నా, రేషన్ బియ్యం రావాలన్నా, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వివిధ కారణాలు చూపి, వ్యక్తుల ఆధార్‌ కార్డులతో లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులతోపాటు, పూర్తి వివరాలు తెలుసుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చిరించింది. ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని కోరింది.