Warning to the residents of Hyderabad..Nalla connection cut
mictv telugu

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక..నల్లా కనెక్షన్ కట్

September 3, 2022

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవారికి జలమండలి అధికారులు ఓ హెచ్చరికను జారీ చేశారు. ”మీరు నీటి బిల్లులు కట్టలేదా? అయితే, వెంటనే చెల్లించండి. లేకపోతే జలమండలి సిబ్బంది మీ ఇంటికొచ్చి, మీ నల్లా కనెక్షన్లు తొలగిస్తారు” అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాబట్టి నల్లా బిల్లులను చెల్లించనివారు వెంటనే చెల్లించాలని కోరారు. అయినా, కూడా బిల్లులను చెల్లించకపోతే జలమండలి అధికారులు రెండు నెలలపాటు ఇంటింటికి వచ్చి, నీటి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో గతకొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన నల్లా బిల్లులపై శుక్రవారం జలమండలి ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. బకాయిల బిల్లులు రూ. కోట్లలో పేరుకుపోవడంతో వాటిని ఎలా వసూలు చేయాలి? అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులతో మాట్లాడుతూ..” రెండు నెలల పాటు ఇంటింటికి వెళ్లి, నీటి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి. ఒక్కో సబ్ డివిజను ఐదుగురు చొప్పున తాత్కాలికంగా 200 మంది మీటర్ రీడర్లను నియమించండి. ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని వారు, ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని వారి నుంచి నల్లా బిల్లులను, బకాయిలను వసూలు చేయండి” అని ఆయన అన్నారు.

ఇక, చివరగా తొలుత బకాయిలు చెల్లించాల్సిందిగా వినియోగదారులకు నోటీసులిచ్చి కొంత గడువిస్తామని, అంతలోపు చెల్లించకపోతే మాత్రం కనెక్షన్లను తొలగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మొత్తం రూ. 100 కోట్ల బకాయిలు వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కావున ప్రజలు అప్రమత్తమై, ఇప్పటికైన నల్లా బిల్లులను చెల్లించాల్సిందా అధికారులు తెలియజేశారు.