నిరుద్యోగులకు హెచ్చరిక.. ఈ స్టడీ మెటీరియల్స్ దండగ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు హెచ్చరిక.. ఈ స్టడీ మెటీరియల్స్ దండగ

May 24, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ అధికారులు, సబ్జెక్ట్ నిపుణులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఇటీవలే విడుదలైన టెట్, పోలీసు, గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మార్కెట్లో దొరికే పుస్తకాలను చదువొద్దు అని హెచ్చిరిస్తున్నారు. ఏ మాత్రం సబ్జెక్ట్‌పై అవగాహన లేనివారితో పుస్తకాలను రాయించి, చాలా తప్పుడు సమాధానాలను ఇస్తున్నారని సూచించారు. మరికొంతమంది అభ్యర్థులు నోటిఫికేషన్లు విడుదలైన రోజు నుంచి నేటీవరకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ, ఆ కోచింగ్ సెంటర్ వారు సిఫార్సు చేసిన స్టడీ మెటీరియల్స్‌‌ను నమ్మి మోసపోతున్నారని, నాణ్యతలేని మెటీరియలను కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు అభ్యర్థులకు అంటగడుతున్నారని నిపుణులు తెలియజేశారు.

”మార్కెట్లో దొరికే పుస్తకాలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పుస్తకాలు దండగ. వాటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కష్టం. మూస విధానంలో, షార్ట్‌కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయి. కొన్ని మెటీరియల్స్ అడ్డగోలుగా, తప్పుల తడకగా ఉంటున్నాయి. అకాడమిక్ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, కోచింగ్ సెంటర్ల మెటీరియల్స్‌లో ఉన్నదానికి పోలికలే ఉండటం లేదు. దీనిపై వివరణ అడిగితే, కోచింగ్ సెంటర్స్ సరిగ్గా స్పందించట్లేదు. ఇక, గ్రూప్‌కు ఉన్న డిమాండ్ అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్ కేంద్రాలు సామ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్ ఏంటి అనే విషయాలను వెల్లడించటం లేదు. చరిత్ర మెటీరియల్స్‌లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారు. అభ్యర్థులు గుర్తించి చెబితే, అచ్చు తప్పులని చెప్తున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్ కొనాలో నిర్వాహకులే సూచిస్తున్నారు. ఇదంతా ఒక వ్యాపారంగా సాగుతోంది. దయచేసి అభ్యర్థులు.. తెలుగు అకాడమీ పుస్తకాలను చదవండి. సబ్జెక్ట్‌పై అవగాహన కల్గిన సీనియర్ ఫ్యాకల్టీ పుస్తకాలను మాత్రమే ఎన్నుకోండి”. అని నిపుణులు నిరుద్యోగులకు సూచనలు చేశారు.