నిత్యానంద ఆశ్రమంలో.. అర్థరాత్రి లేపి మేకప్ వేసి..  - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద ఆశ్రమంలో.. అర్థరాత్రి లేపి మేకప్ వేసి.. 

November 23, 2019

Was Made to Wear Makeup for

ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక మీడియా ముందుకు వచ్చి ఆశ్రమంలో జరుగుతున్న చీకటి కోణాలను వెల్లడించింది. విద్య పేరిట బాలికలను ఆశ్రమంలో చేర్పించుకుని.. వారి ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని బాలిక తెలిపింది. ఈ క్రమంలో తమను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని పేర్కొంది. బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ దంపతుల నలుగురు కూతుళ్ల గురించి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో వారు నలుగురు కుమార్తెలను చేర్పించారు. అయితే ఇటీవల ఆ నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యోగిన సర్వఙ్ఞాన పీఠానికి ఆశ్రమ నిర్వాహకులు బదిలీ చేశారు. విషయం తెలుసుకన్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా.. కలవనివ్వలేదు. 

దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లు అయిన మరో ఇద్దరు కుమార్తెలు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో తమ కూతుళ్లను విడిపించాల్సిందిగా శర్మ దంపతులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

శర్మ వద్దకు వచ్చిన ఓ కూతురు అక్కడి అరాచకాల గురించి తెలిపారు. ‘మే 2013లో గురుకులంలో చేరాను. అప్పుడంతా సరదాగానే ఉండేది. అయితే 2017 నుంచి మాకు నరకం మొదలైంది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు మాతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించేవారు. లక్షల నుంచి కోట్ల వరకు విరాళాలు వచ్చేవి. అలా రూ. 8 కోట్ల వరకు విరాళాలు వచ్చేవి. నగదు చెల్లించలేనివాళ్లు ఎకరాల భూములు సమర్పించేవారు. వీడియోల కోసం అర్ధరాత్రి మమ్మల్ని నిద్రలేపేవారు. మేకప్ బాగా వేసి, పెద్ద పెద్ద నగలు అలంకరించేవారు. తర్వాత స్వామీజీ వద్దకు తీసుకువెళ్లేవారు. మా అక్కను కూడా అలాగే చేశారు. మా అమ్మానాన్నలకు వ్యతిరేకంగా మాట్లాడాలని వేధించారు. నేను అలా మాట్లాడనన్నాను. దీంతో వారు నన్ను పచ్చి బూతులు తిట్టారు’ అని చెప్పింది. 

దీనిపై బాలిక తండ్రి జనార్ధన శర్మ మాట్లాడుతూ.. తాన ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని అరెస్టు చేశారని అన్నారు. తన కూతుళ్లకు మాయమాటలు చెప్పి తన వద్దకు రాకుండా చేస్తున్నారని తెలిపారు. కాగా, నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ పాస్‌పోర్టుతో నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు తెలుస్తోంది.