యాదాద్రిలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా?: కోమటిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రిలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా?: కోమటిరెడ్డి

April 9, 2022

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే, ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. శనివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ..”ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదు. ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదు. మౌళిక సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆలయాన్ని ప్రారంభించి, భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

అంతేకాకుండా యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధించి, భక్తులను ఇబ్బంది పెడుతుంది. ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి, టీఆర్ఎస్ నేతలకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెడుతున్నారు. ఆలయ నిర్మాణంలో వంద లోపాలున్నాయి. వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలి. యాదాద్రికి 22సార్లు వచ్చిన కేసీఆర్ యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా? భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా, నయా పైస కూడా ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇటీవలే యాదాద్రి పునఃప్రారంభానికి కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని కోమటిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా స్థానిక ఎంపీగా ఉన్న తనను పిలవలేదని అన్నారు. కేవలం అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారని, దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.