అకస్మాత్తుగా రాక్షసంగా కురిసిన వానలకు హైదరాబాద్ నగరవాసులు అతలాకుతలం అయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిశాయి. ఇక ఆగిపోయాయి అనుకుంటుండగా మళ్లీ వానలు విజృంభిస్తున్నాయి. దీంతో నగరవాసులు ప్రాణాలు గుప్పిటలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఐదు రోజుల క్రితం మంగళవారం సంగారెడ్డి జిల్లాలో వరదలకు కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్ అనే వ్యక్తి చివరికి శవమై తేలాడు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుక బావి వద్ద మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కాలువపై నుంచి కారు దాటుతున్న క్రమంలో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో బీరంగూడకు చెందిన ఆనంద్ ఉన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాలువ వద్దకు వెళ్లి పరిశీలించారు. అధికారులతో చర్చించి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ఇసుకబావి వాగులో ఇవాళ కారు లభించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును బయటికి తీసుకువచ్చింది. జేసీబీ సహాయంతో కారుకు తాళ్లు కట్టి ఒడ్డుకు తీసుకువచ్చారు. కారులోంచి మృతుడి కాళ్లు కనిపించాయి. వరదల్లో తప్పిపోయిన ఆనంద్ ఎక్కడైనా క్షేమంగానే ఉండుంటాడని భావించిన కుటుంబ సభ్యులు అతని మృతివార్త విని కుప్పకూలిపోయారు. ఆనంద్కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కూతురు పుట్టినరోజు రేపు అనగా అతను వరదల్లో గల్లంతు అయ్యాడు. కాగా, రెండు రోజుల క్రితం వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తి కూడా కారుతో సహా వరదకు కొట్టుకుపోయి చివరికి శవమై తేలాడు. వెంకటేశ్ గౌడ్ తన మిత్రుడితో చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో ఎందరినో కదిలించింది.