కరోనాపై 36 రోజుల శిశువు విజయం.. చప్పట్లే చప్పట్లు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై 36 రోజుల శిశువు విజయం.. చప్పట్లే చప్పట్లు

May 28, 2020

juhy

కరోనా సంక్షోభంలో ఇంతవరకు జరగని అద్భుతం జరిగింది. చిన్నారులకు, వృద్ధులకు కరోనా సోకితే వారు కోలుకోవడం కష్టం అని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల ఆ మాటను అబద్ధం చేస్తూ వందేళ్లు పైబడ్డ వృద్ధులు కరోనా నుంచి కోలుకుని షాక్ ఇస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో 36 రోజుల చిన్నారి కరోనాపై విజయఢంకా మోగించింది. కరోనాతో వణికిపోతున్న మహారాష్ట్రలో రోజుల చిన్నారి కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయమై ట్వీట్ చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. కరోనాతో పోరాడేందుకు వయసు ముఖ్యం కాదని తెలిపింది. ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో 36 రోజుల చిన్నారి కోలుకుందని వెల్లడించింది. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సీఎంవో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.83 లక్షల మంది వీక్షించారు. చిన్నారిని తల్లి ఎత్తుకుని వస్తుండగా ఆసుపత్రి సిబ్బంది కరతాళ ధ్వనులతో అభినందించడం ఈ వీడియోలో చూడొచ్చు.