చావు బతుకుల మధ్య ఉన్న కన్నతల్లి కడసారి కోరికను నెరవేర్చిందా కూతురు. ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాడుతున్న తన తల్లిని సంతోషపెట్టేందుకు.. ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వివాహం జరిగిన రెండు గంటలకే ఆ మాతృమూర్తి కన్నుమూసింది. దీంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బిహార్‌లోని గయలో జరిగిందీ సంఘటన.
జిల్లాలోని బాలి గ్రామానికి చెందిన లాలన్ కుమార్ భార్య పూనమ్ వర్మ.. కన్నకూతురు చాందినికి తన చేతులమీదుగా పెళ్లి చేయాలని ఆమె ఎన్నో కలల కన్నది. కుమార్తెకు సరిజోడైన వరుడిని కూడా వెతికింది. ఇంకొక్క రోజులో(డిసెంబర్ 26) నిశ్చితార్థం జరగనున్న తరుణంలో తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది. ఆమె ఇక బతకదని.. ఏదైనా చివరి కోరిక ఉంటే తీర్చాలని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కళ్ల ముందే కన్నకూతురి పెళ్లి జరిపించారు.
మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న పూనమ్ వర్మ.. కరోనా కాలంలో విశేష సేవలందించారు. ఆ తర్వాత ఆమె గుండె జబ్బుకు గురయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఒక్కసారిగా పూనమ్ ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆమెను చికిత్స కోసం కుటుంబసభ్యులు గయలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె ఆరోగ్య మెరుగుపడకపోగా.. మరింత విషమించింది. ఐసీయూలో ఆమెకు చికిత్స కొనసాగించిన వైద్యులు.. బతకడం కష్టమని, ఏ క్షణమైనా ప్రాణం పోతుందని చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో తన కుమార్తె చాందిని పెళ్లి తన చేతుల మీదుగానే చేయాలని ఉందంటూ కుటుంబసభ్యులకు చివర కోరిక గురించి చెప్పుకుని పూనమ్ వాపోయింది. దీంతో ఆమె కోరిక మేరకు ఐసీయూ వార్డులోనే పెళ్లి జరిపించారు.
मरती मां की ख्वाहिश देख ICU में हुई बेटी की शादी #Bihar #ICU pic.twitter.com/vpxDbcJbnr
— Aman Kumar Dube (@Aman_Journo) December 26, 2022
వాస్తవానికి.. చాందిని నిశ్చితార్థం డిసెంబరు 26న జరగాల్సి ఉంది. కానీ పూనమ్ చివర కోరిక నెరవేర్చేందుకు ఆదివారం ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి చేశారు. వివాహం జరిగిన రెండు గంటలకే పూనమ్ చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి ఇక లేదని, తిరిగి రాదని కూతురు చాందినీ కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇవి కూడా చదవండి :
అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండవ స్థానం..మొదటిస్థానంలో…
సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో షారూఖ్ ఖాన్ సందడి..వీడియో వైరల్