WATCH: Ganesh idol stolen in Hyderabad!
mictv telugu

అర్ధరాత్రి హయత్‌నగర్‌లో వినాయకుడి విగ్రహాన్ని కొట్టేసిన యువకులు

August 31, 2022

రాజా సినిమాలో హీరో వెంకటేశ్ను ఫాలో అయ్యారేమో తెలియదు కానీ.. అర్ధరాత్రి పూట వినాయకుడి విగ్రహాన్ని కొట్టేశారు కొందరు యువకులు. హైదరాబాద్‌లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర భవన్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు యువకులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్దకు వచ్చారు. తాము తెచ్చిన ఆటోను రోడ్డుకు అవతలివైపునే పెట్టారు. ఎవరూ లేకపోవటం చూసి.. షెడ్డులో నుంచి వినాయకుడి విగ్రహాన్ని గుట్టుగా బయటకు తీసుకొచ్చారు. విగ్రహం బరువుగా ఉండటంతో.. హోటల్ వద్ద రోడ్డుపై పెట్టారు. అటు ఇటూ చూసి వాహనాలు రాని సమయంలో వినాయకున్ని వేగంగా రోడ్డు దాటించారు. రోడ్డు అవతల ఉన్న ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఈ ఏడాది వినాయకుడి విగ్రహాలకి ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే.. దానికి తగ్గట్టుగా చందాలు వసూలు చేయటమో..? లేదంటే దాతలను ఒప్పించటమో..? చేసి ప్రతిమను కొనుక్కెళ్లాలి. ఒకవేళ అవేమీ కుదరకపోతే.. వాళ్ల దగ్గరున్న బడ్జెట్కు సరిపోయే విగ్రహాన్ని కొనుక్కెళ్లాలి. అంతే కానీ.. ఆ యువకులు ఇలాంటి పని ఎందుకు చేశారని వీడియో చూసినవాళ్లంతా అంటున్నారు. ఆ యువకులు ఎవరూ..? ఎందుకు ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.